Monday, January 31, 2011

పిసినారి పాపయ్య

అనగనగా ఒక ఊరిలో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని అదిల్చితే, చేతికి ఉన్న మెతుకులు కాకి ఎత్తుకు పోతుందనుకునే తరహా మనిషి పాపయ్య. తాను సరిగా తినడు, ఇంట్లో వాళ్లని సరిగా తిననివ్వడు. ఎంత పేదవాళ్లకైనా సరే పైసా కూడా దానం చేయడు. కాని ఎవరి దగ్గరనుంచైనా తీసుకోవలసి వస్తే మాత్రం అస్సలు మొహమాటపడకపోగా వీలయినంత ఎక్కువ తీసుకోవాలనే ధోరణి ఉన్నవాడు.


పాపయ్య ధోరణి ఆ ఊరి వారందరికీ తెలుసు. చుట్టు పక్కల గ్రామాల వారు కూడా పాపయ్య గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. పాపయ్య మాత్రం తన గురించి ఎవరేమనుకున్నా పట్టించుకునేవాడే కాదు. ఆ పక్క ఊరిలో దానయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చేతికి ఎముకలేనంతగా దానధర్మాలు చేసేవాడు. ఒకసారి దానయ్య తోటలో పుచ్చకాయలు విరగకాసాయి. ఆ ఊరి వారందరినీ పిలిచి పుచ్చకాయలు పంచటం మొదలుపెట్టాడు.
అనుకోకుండా అదే సమయంలో పాపయ్య ఆ ఊరికి వచ్చాడు. ఊరివారంతా పుచ్చకాయలు పట్టుకొని వెళ్లడం గమనించాడు. దానయ్య పుచ్చకాయలు పంచుతున్నాడని తెలుసుకున్నాడు. తాను కూడా రెండు మూడు కాయలు తెచ్చుకుందామని అక్కడికి వెళ్లాడు. అక్కడ గుట్టగా పోసిన కాయలలోంచి ఎవరికి నచ్చింది వారు తీసుకెళ్లడం చూశాడు. పాపయ్య రెండు కాయల్ని తీసుకొని రెండు చంకల్లో ఇరికించుకున్నాడు. మూడోది కూడా తీసుకోవాలనే అత్యాశతో దానిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతసేపు ప్రయత్నించినా వీలు కాలేదు.
ఇదంతా గమనిస్తున్న దానయ్య, పాపయ్య దగ్గరికి వచ్చి, ‘‘మీ పేరు పాపయ్యేనా’’అని అడిగాడు. ‘‘అవును. నా పేరు పాపయ్యే. కాని మనం ఎప్పుడూ కలుసుకోనేలేదు. నా పేరు మీకెలా తెలుసు?’’ అని అడిగాడు ఆశ్చర్యంగా. ‘‘ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిసినారితనానికి, అత్యాశకి మీరు మారుపేరని అందరూ మీ గురించే చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చిన వారంతా ఒక్కొక్క కాయ తీసుకెళ్తుంటే, మీరు మాత్రమే మూడు కాయల్ని తీసుకెళ్లాలని చూశారు. మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడూ చూడకపోయినా, మీ అత్యాశని చూసి గుర్తుపట్టాను’’ అన్నాడు దానయ్య. ఆ చుట్టు పక్కల దానయ్యకి ఉన్న మంచిపేరునీ, తనకున్న చెడ్డపేరునీ పోల్చుకొని సిగ్గుపడ్డాడు పాపయ్య. నెమ్మదిగా తనని తాను మార్చుకున్నాడు. కాలక్రమంలో పరోపకారి పాపయ్యగా పేరు తెచ్చుకున్నాడు.

0 comments:

About This Blog

Lorem Ipsum

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP