Monday, January 31, 2011

రాజుగారి తలపై ఈక!

అనగనగా ఒక రాజ్యంలో సుందరుడు అనే విదూషకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ కలుపుగోలుగా ఉండే వాడు.‘‘నువ్వు రాజు ఆస్థానంలో ఉండవలసినవాడివి’’ అంటూ అతని బంధువులూ, స్నేహితులూ మెచ్చుకునేవారు. అందరూ ప్రోత్సహించటంతో ఒకరోజు సుందరుడు రాజుని కలవాలని బయలుదేరాడు. ఆయన వచ్చే సమయానికంటే ముందుగానే సుందరుడు అక్కడికి చేరుకున్నాడు.

రాజు అంతఃపురం నుంచి బయలుదేరి ఆస్థానానికి వస్తుండగా ఆయన తల మీద ఒక పక్షి ఈక పడింది. చాలామంది దానిని గమనించారు. కాని ఆ విషయం చెప్తే రాజుకి కోపం వస్తుందని భయపడి ఊరుకున్నారు. కొంతమంది నవ్వు ఆపుకున్నారు. మరి కొంతమంది రాజు చూడకుండా వెనుకకు తిరిగి నవ్వుకున్నారు.

రాజు అలాగే ఆస్థానంలోకి ప్రవేశించాడు. తలపైన ఈకతో వచ్చిన రాజును చూడగానే సుందరుడు పక్కున నవ్వాడు. అది గమనించిన రాజు కోపంగా కారణం అడిగాడు. ఈక సంగతి చెప్పి మళ్లీ నవ్వాడు సుందరుడు. రాజుకి విపరీతంగా కోపం వచ్చింది. సుందరుడికి ఉరిశిక్ష విధించి వెంటనే అమలు చేయమని భటులకు ఆదేశించాడు.

భటులు వచ్చి సుందరుడిని తీసుకు వెళ్తున్నపుడు రాజు సుందరుడితో ‘‘నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా తీరుస్తాం’’ అన్నాడు. అప్పుడు సుందరుడు ‘‘మహారాజా! నాకు చిన్నప్పటి నుంచి మెడను ఎవరైనా ముట్టుకుంటే చక్కిలి గింతలు పెట్టినట్టు ఉంటుంది. నేను వాటిని అస్సలు భరించలేను. కాబట్టి నాకు మెడకు కాకుండా నడుముకు ఉరి వేయమని కోరుతున్నాను’’అన్నాడు.

వెంటనే రాజుతో సహా సభలో ఉన్న వాళ్లందరూ ఘొల్లున నవ్వారు. చాలాసేపు అలా నవ్వుతూ ఉండి పోయాడు. అప్పుడు సుందరుడు ‘‘నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని నా నమ్మకం. అందుకే నేను నవ్వటానికి, నవ్వించటానికి ప్రయత్నిస్తాను’’ అన్నాడు. అతని హాస్య చతురతను, సమయస్ఫూర్తిని రాజు అభినందించాడు. అతనిని తన ఆస్థాన విదూషకునిగా నియమించాడు. సుందరుడు, అతని బంధువులు ఎంతో సంతోషించారు.

0 comments:

About This Blog

Lorem Ipsum

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP